Breaking News

సంగారెడ్డిలో మొబైల్ రికవరీ మేళా – 219 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత

▪️ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ
▪️ మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మొబైల్ రికవరీ మేళా”లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బాధితులకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లా ఐటీ సెల్, సైబర్ సెల్, ఎస్-న్యాబ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గత నెల రోజులుగా ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 219 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటిని ఈ రోజు బాధితులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా రోజువారీ లావాదేవీలు జరగని పరిస్థితి నెలకొన్నదని, బ్యాంక్ ఖాతాలు, పాస్‌వర్డ్లు వంటి ముఖ్యమైన సమాచారాన్ని మొబైల్‌లో భద్రపరుస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక నష్టం కూడా కలుగుతుందని హెచ్చరించారు.

సంగారెడ్డిలో సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ నూతన భవనం ప్రారంభం

సెల్ ఫోన్ దొంగతనాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్‌లో నమోదు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగిలించబడిన ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొబైల్ రికవరీలో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *