
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుండి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. మహిళల భద్రత, కోసం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని, మహిళలపై జరిగే నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిర్భయంగా ముందుకు వచ్చినప్పుడే మీకు జరిగిన నేరం తిరిగి పునరావృతం కాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ జిల్లా భరోసా సెంటర్ మరియు షీ-టీమ్స్ ద్వారా మహిళల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పోక్సో మరియు అత్యాచార కేసులలో సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ ద్వారా బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ కౌన్సిలింగ్, మెడికో–లీగల్ సేవలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ద్వారా షెల్టర్ సదుపాయం కల్పించడంతో పాటు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో నమోదైన 281 పోక్సో మరియు అత్యాచార కేసులలో బాధితులకు అన్ని రకాల సేవలు అందించడంతో పాటు బాధితులకు లీగల్ సపోర్ట్ అందించి న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించడం ద్వారా 6 మంది నిందితులకు శిక్ష పడేలా చేసినట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను నివారించడానికి మరియు వారిలో అవగాహన పెంపొందించడానికి విద్యాసంస్థలు, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100 లేదా జిల్లా షీ-టీం నెంబర్: 8712565672, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 ను సంప్రదించాలని సూచించారు.
