Breaking News

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణ

జగిత్యాల, ఆగస్టు 1: జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 104 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం అప్పగించినట్లు వెల్లడించారు.

జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పోలీస్ శాఖతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ తనిఖీల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని పనిచేయిస్తున్న యజమానులపై 27 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడం, బాలల హక్కులను పరిరక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.

ఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదు

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. బాలలతో పనులు చేయిస్తున్న వారిని గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వీధి బాలలు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *