డీ-అడిక్షన్ కార్యక్రమాలతో వ్యసనాల బారిన పడిన వారిలో మార్పు తీసుకొస్తున్న పోలీసులు
మహబూబాబాద్, జూన్ 4: జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను పూర్తిగా నిర్మూలించి మహబూబాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు
జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని ఎస్పీ వెల్లడించారు. డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది రాత్రివేళల్లో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలు, యువత ఎక్కువగా గుమికూడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
10 నిమిషాల్లో గంజాయి గుర్తింపు
గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు జిల్లాకు అత్యాధునిక 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. విధుల్లో భాగంగా పోలీసు సిబ్బంది ఈ కిట్లను వెంట తీసుకెళ్తూ అనుమానిత వ్యక్తులు లేదా పదార్థాలను అక్కడికక్కడే పరీక్షించగలరన్నారు. కేవలం 10 నిమిషాల్లో ఫలితాలు రావడంతో గంజాయి సేవిస్తున్న వారిని, నిల్వ ఉంచిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం సులభమవుతుందని చెప్పారు.
డీ-అడిక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యం
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి జిల్లా పోలీసు శాఖ డీ-అడిక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం, పునరావాస సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
యువతను వ్యసనాల నుంచి కాపాడడమే లక్ష్యం
యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గంజాయి కేసుల్లో కఠిన చర్యలు
గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయం, వినియోగం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలు, మీడియా, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించి మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
