Breaking News

ఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదు

నల్లగొండ, ఆగస్టు 1: పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన మరియు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన **”ఆపరేషన్ ముస్కాన్–XII”**లో నల్లగొండ జిల్లా పోలీసులు విశేష ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

జూలై నెల మొత్తం చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో జిల్లా పోలీస్ శాఖ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తదితర శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 124 మంది చిన్నారులను రక్షించారు. వీరిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.

చిన్నారులను అక్రమంగా పనుల్లో నియమించుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

రక్షించిన చిన్నారుల్లో అధిక సంఖ్యలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వీరిలో చాలామంది రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

ఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదు

రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, కుటుంబ వివరాలు సేకరించిన అనంతరం చట్టపరమైన నిబంధనల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం లేదా అవసరమైన సంరక్షణ గృహాలకు తరలించడం జరిగిందని తెలిపారు. వారి విద్య, పునరావాసం, సంక్షేమం కోసం సంబంధిత శాఖల ద్వారా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలను ప్రమాదకర పరిశ్రమల్లో నియమించడం కూడా నేరమని స్పష్టం చేశారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గమనించినా, ఏ చిన్నారి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్, డయల్–100, 112 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించి చిన్నారుల రక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం కావడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో పనిచేసిన డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ అంజలి, పోలీస్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *