సిరిసిల్ల, జూలై 28: పోక్సో (POCSO) కేసులపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమర్థవంతమైన దర్యాప్తు, వేగవంతమైన కోర్టు విచారణతో మరో పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
జిల్లాలోని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బుర్లా చంద్రశేఖర్‌కు సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు.
కేసు వివరాలు
సిరిసిల్లకు చెందిన బుర్లా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణ
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల మొత్తం 15 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్ వాదనలు వినిపించారు.
శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు.
ఎస్పీ అభినందనలు
పోక్సో కేసుల్లో జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహిస్తూ, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేసుకుని వేగవంతమైన విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నేరానికి పాల్పడిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి విచారణ అధికారి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెలలను జిల్లా ఎస్పీ అభినందించారు.
