బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, లోన్ యాప్, ఆన్‌లైన్ ప్రకటనల మోసాలపై హెచ్చరిక
సంగారెడ్డి, జూన్ 3: సైబర్ నేరాల నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సైబర్ జాగృత్ దివస్” కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మండలం చెర్యాల్ గ్రామంలోని ఎక్సెల్ ప్లాంట్ యూనిట్-4 ఉద్యోగులు, సిబ్బందికి సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి నెల మొదటి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సైబర్ జాగృత్ దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను సైబర్ నేరాలపై చైతన్యపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
వివిధ రకాల సైబర్ మోసాలపై వివరణ
కార్యక్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న పలు మోసపూరిత పద్ధతుల గురించి వివరించారు.
బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు: అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రారంభంలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చి, అనంతరం భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసే విధానాన్ని వివరించారు.
అడ్వర్టైజ్‌మెంట్ ఫ్రాడ్: నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు అందకపోవడం వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంపర్సనేషన్, కొరియర్ మోసాలు: కొరియర్ సంస్థ ప్రతినిధులు లేదా ప్రభుత్వ అధికారులు అంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేసే ఘటనలను వివరించారు.
లోన్ యాప్ మోసాలు: అక్రమ రుణ యాప్‌ల ద్వారా ప్రజలను వేధించడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఓఎల్ఎక్స్ మోసాలు: వస్తువుల కొనుగోలు, అమ్మకాల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు కీలక సూచనలు
గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద సందేశాలు, లింకులు, పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్‌ఐ విజయ్, సైబర్ సెల్ సిబ్బంది, ఎక్సెల్ ప్లాంట్ యూనిట్-4 యాజమాన్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.
