Breaking News

తాండూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

పారదర్శక పోలీసింగ్, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు ఆదేశం

వికారాబాద్, జూన్ 4: ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తాండూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసుల పురోగతి, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీ షీట్లు, ఆర్డర్ బుక్, బీట్ బుక్స్, వారెంట్ల అమలు పరిస్థితులు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల రికార్డులు, కేసు ప్రాపర్టీల భద్రత వంటి అంశాలను తనిఖీ చేసి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ప్రజలు, పోలీసుల మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. స్టేషన్‌లో ఎలాంటి రికార్డులు పెండింగ్‌లో ఉండకూడదని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని స్పష్టం చేశారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, అలాంటి కేసుల్లో తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

కొత్లాపూర్‌లో టాస్క్ ఫోర్స్ దాడులు.. రూ.40 వేల విలువైన నాటు సారా ముడి పదార్థాల స్వాధీనం

పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

రాబోయే బోనాలు, మొహర్రం పండుగలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో గస్తీని నిరంతరం కొనసాగించడంతో పాటు పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *