Breaking News

జిల్లాలో నైట్ బీట్ వ్యవస్థకు మరింత బలోపేతం.. పోలీసులకు ఆధునిక భద్రతా సామగ్రి పంపిణీ

జిల్లాలో రాత్రి వేళల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర సహాయం అందించే నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్స్, ఫైబర్ లాఠీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో నైట్ బీట్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, చీకటి వీధులు, నిర్మానుష్య ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులపై నిరంతరం అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.

విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని పేర్కొంటూ, రాత్రి సమయంలో వాహనదారులకు పోలీసులు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ జాకెట్లు ఉపయోగపడతాయని తెలిపారు. దీంతో రోడ్డు ప్రమాదాల అవకాశాలు తగ్గడంతో పాటు విధుల నిర్వహణ మరింత సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఎల్‌ఈడీ బ్యాటన్స్ ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలు, అత్యవసర పరిస్థితుల్లో హెచ్చరిక సంకేతాల కోసం ఉపయోగపడతాయని, ఫైబర్ లాఠీలు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అవసరమైన సందర్భాల్లో ఆత్మరక్షణకు, చట్ట అమలుకు దోహదపడతాయని వివరించారు.

ప్రతి నైట్ బీట్ అధికారి తన పరిధిలోని కాలనీలు, గ్రామాలు, వ్యాపార సముదాయాలు, ఏటీఎంలు, బ్యాంకులు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఒంటరి ఇళ్లు వంటి సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించిన వెంటనే తనిఖీలు చేపట్టి, అవసరమైతే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారానికి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చిన మహిళా భద్రత విభాగం

దొంగతనాలు, చైన్ స్నాచింగ్, వాహనాల చోరీలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలను ముందుగానే అరికట్టేలా గస్తీని మరింత పటిష్టం చేయాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందేలా పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం అవసరమైన వారికి వెంటనే స్పందించి పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి భద్రత, విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ, ఆధునిక సాంకేతిక పరికరాలు, భద్రతా సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి పోలీసింగ్‌ను మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు. ప్రజలకు భద్రత కల్పించడంలో నైట్ బీట్ వ్యవస్థ కీలకమని, ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా విధులు నిర్వహించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *