హైదరాబాద్: నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్మర చర్యలు కొనసాగిస్తున్నారు. కేవలం కేసుల నమోదుకే పరిమితం కాకుండా, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించడం, వినియోగదారులకు పునరావాసం కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం, 2025 జూన్ నుంచి 2026 జూన్ వరకు నగరంలో మొత్తం 563 ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో భాగంగా రూ.22.17 కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని డ్రగ్స్ ముఠాలపై భారీ దెబ్బ కొట్టారు.
జోన్ల వారీగా కేసుల వివరాలు
గత ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్‌లో 116 కేసులు నమోదయ్యాయి. అనంతరం సికింద్రాబాద్ జోన్‌లో 99, గోల్కొండలో 95, చార్మినార్‌లో 90, రాజేంద్రనగర్‌లో 84, ఖైరతాబాద్‌లో 49, శంషాబాద్ జోన్‌లో 30 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు నగరంలోని డ్రగ్స్ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడిస్తున్నాయి.
భారీగా డ్రగ్స్ స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల్లో అత్యధికంగా గంజాయి ఉంది. మొత్తం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో:
- 2,513 కిలోల గంజాయి (విలువ రూ.12.56 కోట్లు)
- 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్ (రూ.6.91 కోట్లు)
- 1,626 గ్రాముల ఎండీఎంఏ (MDMA) (రూ.1.62 కోట్లు)
- 129 గ్రాముల కొకైన్ (రూ.64.50 లక్షలు)
- 120 గ్రాముల హెరాయిన్ (రూ.24 లక్షలు)
- 570 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు (రూ.17.10 లక్షలు)
- 220 గ్రాముల ఓపియం (రూ.1.25 లక్షలు)
స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’తో దాడులు
డ్రగ్స్ విక్రయ కేంద్రాల నిర్మూలనలో భాగంగా ఇటీవల హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో 1,100 మంది పోలీసు సిబ్బందితో ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరిట భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో గంజాయితో పాటు అక్రమ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ వినియోగదారులకు పునరావాసం
డీసీపీ హెచ్-న్యూ పర్యవేక్షణలో నగరవ్యాప్తంగా అనుమానితులు, రౌడీషీటర్లకు డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1,550 మందికి పరీక్షలు నిర్వహించగా, 421 మందికి పాజిటివ్‌గా తేలింది.
వారిని శిక్షించడమే కాకుండా గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించి వైద్య చికిత్స, కౌన్సిలింగ్ అందిస్తూ వ్యసన విముక్తి కల్పించే చర్యలు చేపడుతున్నారు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ, డ్రగ్స్ మహమ్మారిపై ప్రభుత్వం, పోలీసు శాఖ రాజీలేని పోరాటం కొనసాగిస్తోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పిల్లల్లో ఆకస్మిక ప్రవర్తనా మార్పులు, చిరాకు, ఒంటరిగా ఉండే అలవాటు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేశారు.
డ్రగ్స్ సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా హెచ్-న్యూ విభాగం నంబర్ 8712661601కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
