సంగారెడ్డి, ఫిబ్రవరి 28:జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల వివరాలను సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు వేగంగా పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, సందేహాలు ఉన్న సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడి భరోసా కల్పించాలని, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని తెలిపారు.
మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని, బ్లూ కోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాపిలాన్ పరికరాలతో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించాలని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీసు వాహనాలను తనిఖీ చేసి, రెగ్యులర్ సర్వీసింగ్ చేయాలని డ్రైవర్లకు సూచించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ సి.హెచ్. రఘునందన్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
