
గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా, రానున్న రెండు రోజులలో జిల్లాకు భారీ వర్ష సూచన ఉండటం, ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరే వరద ప్రవాహం వలన చెరువులు, వాగులు, బ్రిడ్జ్ ల వద్ద పరిస్థితిని సమీక్షించడానికి జహీరాబాద్ సబ్-డివిషన్ పరిధిలో గల చెరువులు, బూచనెల్లి వాగు, నారింజ బ్రిడ్జ్, రాయిపల్లి బ్రిడ్జ్, జహారాసంఘం, న్యాలకల్, రాయికోడ్ మండలాలను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,అత్యవసర పరిస్థితులలో తీసుకోవలసిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఈ వరదల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురాతన ఇండ్లు, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. ఆనకట్టలు ప్రమాద అంచున ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. వరద ప్రవాహం పెరిగి, ఆనకట్టలు ప్రమాద స్థాయికి చేరకముందే, ముందస్తు చర్యలు వేగవంతం చేయవలసిందిగా సంభందిత ఇరిగేషన్ అధికారులకు సూచించడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయాలు చెరువులు, కుంటలు నిండు కుండలా మరే అవకాశం ఉందని, పొంగిపొర్లుతున్న వాగులు వంకలను చూడడానికి, దాటడానికి ప్రయత్నించకూడదన్నారు. నిన్న రాయికోడ్ మండలం లోని యుసుఫ్ పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పిట్టవాగు దాటుతు ప్రమాదవశాత్తూ మృతి చెందాడని పిట్ట వాగును సందర్శించిన ఎస్పీ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.వరద ప్రవాహం వచ్చే సమయంలో ఎవ్వరూ వాగును దాటాడానికి ప్రయత్నించకూడదని, సూచించారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. ఈ సందర్శనలో ఎస్పీ వెంబడి జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు, సబ్ డివిజన్ ఎస్ఐ లు తదితరులు ఉన్నారు.
