
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్,ఆదేశానుసారం, సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “నశా ముక్త్ భారత్ అభియాన్” (Nasha Mukt Bharat Abhiyaan) కార్యక్రమం లో భాగంగా, జిల్లాలోని వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నశా ముక్త్ ఆంటీ సోల్జర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. రేపటి సమాజ నిర్మాతలైన యువత మాదకద్రవ్యాల/డ్రగ్ మహమ్మారి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించే పేరెంట్–టీచర్ సమావేశాలలో డ్రగ్ నిర్మూలన అంశంపై చర్చించాలని, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించి, ఎవరు డ్రగ్‌కు అలవాటు పడుతున్నారో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, డ్రగ్ వినియోగం ఆనవాళ్లు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. డ్రగ్ బానిసలైన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి, కౌన్సిలింగ్ అందించబడుతుందని తెలియజేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, గంజాయి సాగు, అక్రమ రవాణా నిర్మూలనకై ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ ద్వారా సత్:ఫలితాలు రాబట్టడం జరుగుతుంది అన్నారు. జిల్లాలో డ్రగ్ లేదా అక్రమ రవాణా సంబంధిత సమాచారం ఉన్నట్లయితే S-Nab: 8712656777 కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసినా లేదా అంతర పంటగా వేసినా, వారి భూములను జప్తు చేయడానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ప్రజలు మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండి, “మత్తు లేని భారత దేశం” నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “నశా ముక్త్ ఆంటీ సోల్జర్ ప్రతిజ్ఞ”లో ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, ఆర్.ఐలు రామరావ్, శ్రీనివాస్ రావ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
