
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక పాఠశాల నుంచి పారిపోయిన ఓ 12 ఏళ్ల బాలికను బాలానగర్ సీఐ నర్సింహా రాజు రక్షించి, ఆమె తల్లికి అప్పగించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింహా రాజు తెలిపిన వివరాల ప్రకారం చింతల్ చెరుకుపల్లి కాలనీకి చెందిన శివారెడ్డి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె చంద్రిక (12), లిటిల్ స్కాలర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతోంది. ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా, చంద్రిక స్కూల్‌కు బయలుదేరింది. అయితే, సరిగా మార్కులు రావడం లేదని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక, స్కూల్‌కు వెళ్లకుండా ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న సీఐ నర్సింహా రాజు ఫుట్‌పాత్‌పై రోదిస్తూ వెళ్తున్న బాలికను గమనించి ఆపారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లి నాగలక్ష్మిని పిలిపించి, బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు. సీఐ నర్సింహా రాజు సమయస్ఫూర్తితో వ్యవహరించడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
