హైదరాబాద్, జూన్ 5: మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి కఠినంగా స్పందించింది. చార్మినార్ ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఈ కేసుల్లో వేగంగా విచారణ పూర్తి కావడంతో నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించబడింది.
షీ టీమ్స్ నిర్వహించిన ప్రత్యేక నిఘా సమయంలో మహిళలను అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
అరెస్టు చేసిన నిందితులను జూన్ 4న నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం ఐదుగురినీ దోషులుగా నిర్ధారించి, ప్రతి ఒక్కరికి మూడు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.
మహిళలు, బాలికలపై వేధింపులు, స్టాకింగ్, సైబర్ హరాస్మెంట్ వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని షీ టీమ్స్ స్పష్టం చేసింది. ఎలాంటి వేధింపులు ఎదురైనా బాధితులు వెంటనే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించింది.
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అనవసరంగా పంచుకోవద్దని అధికారులు సూచించారు. అలాగే బలమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి భద్రతా చర్యలను ఉపయోగించాలని పేర్కొన్నారు.
వేధింపులకు గురైన మహిళలు లేదా ప్రత్యక్షంగా అలాంటి ఘటనలను గమనించిన వారు వెంటనే 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయవచ్చని, అలాగే షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
