పోలీసు సిబ్బంది కుటుంబాలకు చెందిన పిల్లల విద్యా, వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్తు లక్ష్య సాధనకు దోహదపడే ఉద్దేశ్యంతో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “స్పార్క్” (SPARK: Supporting Potential and Academic Rise for Khaki Kids) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఖాకీ కిడ్స్‌తో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను వెలికితీసి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడడమే “స్పార్క్” కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటు పెంచుకోవాలని సూచించారు.
అదేవిధంగా, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విధుల విరామ సమయంలో పోలీసు సిబ్బంది చదువుకునేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పోలీసు సిబ్బంది తమ విధులతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పిల్లల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. అర్హత కలిగిన సిబ్బంది కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు సిబ్బంది, ఖాకీ కిడ్స్ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
