
హైదరాబాద్ సిటీ పోలీస్, 2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ కార్యక్రమాన్ని సీపీ కార్యాలయం, ఆడిటోరియం, ఐసీసీసీ భవనం, బంజారా హిల్స్‌లో నిర్వహింనారు. 2025లో కేసులను గుర్తించి, పరిష్కరించడంలో గణనీయమైన కృషి చేసిన 446 మంది అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ అవార్డు గ్రహీతలలో 2 ఏసీపీలు, 49 ఇన్‌స్పెక్టర్లు, 38 ఎస్సైలు, 21 ఏఎస్సైలు, 30 హెడ్ కానిస్టేబుళ్లు, 220 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 11 మంది హోమ్ గార్డ్స్, 45 మంది మినిస్టీరియల్ సిబ్బంది, 25 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మరియు ఐదుగురు ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొంటూ, ఉత్తమ పనితీరును గుర్తించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఈ రివార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న నిరంతర కృషిని అభినందించారు. 80 లక్షల జనాభాతో, వివిధ రకాల నేరస్తులతో కూడిన నగరంలో అందరికీ న్యాయం చేయడం అసాధ్యమైన పని అయినప్పటికీ, మన పోలీసులు అందులో రాణిస్తున్నారని అన్నారు. “మనం ప్రతిరోజూ ఏదో ఒక బందోబస్తు లేదా భద్రతా ఏర్పాట్లతో చాలా బిజీగా ఉంటాం. నగరంలో ఎప్పుడు ఎలాంటి నేరాలు జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, కేసులను త్వరగా పరిష్కరిస్తున్నాం. మనమంతా కలిసి చేసిన ప్రయత్నాల వల్లే హైదరాబాద్ సిటీ పోలీసులకు ప్రశంసలు దక్కడమే కాకుండా దేశంలోనే చెప్పుకోదగ్గ గుర్తింపు లభిస్తోంది. ఇంత పెద్ద నగరంలో మన పోలీసులు తమ విధులకు అంకితమై, నిరంతర కృషి చేయడం వల్లే సమాజంలో శాంతి మరియు ప్రశాంతత నెలకొన్నాయి,” అని కమిషనర్ అన్నారు. మన నగరంలో జనాభా వేగంగా పెరుగుతోందని, 24/7 వ్యాపార సముదాయాలు, అర్ధరాత్రి వరకు కూడా ప్రజలు రోడ్లపై సంచరించడం జరుగుతోందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. విధుల నిర్వహణలో హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు చూపిస్తున్న అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. కేసుల గుర్తింపులోనూ, పరిష్కారంలోనూ విశేష కృషి చేసి, విజేతలుగా నిలిచిన రివార్డ్ గ్రహీతలను కమిషనర్ అభినందించారు. ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో వుమెన్ సేఫ్టీ వింగ్, సైబర్ క్రైమ్ వింగ్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. నగరంలోని ప్రతి విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది నేరాలను అదుపు చేయడానికి, కేసులను ఛేదించడానికి కృషి చేస్తున్నారు. సీవీ ఆనంద్, ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీ. విశ్వ ప్రసాద్, ఐపీఎస్, అడిషనల్ సీపీ (క్రైమ్), శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్, సీసీఎస్ డీడీ మరియు ఇతర అధికారులు, రివార్డ్ గ్రహీతలు పాల్గొన్నారు.
