
తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ లో జీడిమెట్ల ఎస్ఐ ప్రేమ్ సాగర్ విశేషమైన ప్రతిభ కనపరచి ఆయన మూడు విభాగాలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సంపాదించాడు. ఆయన చూపిన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్ జట్టుకు ఛాంపియన్ షిప్ లభించింది.
వరంగల్ లో జరిగిన పోటీలో: వరంగల్ లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు తెలంగాణ రెండవ డ్యూటీ మీట్ కార్యక్రమాలను నిర్వహించారు. సైబరాబాద్ టీం తరపున ఈ పోటీలో పాల్గొన్న జీడిమెట్ల ఎస్ఐ ప్రేమ్ సాగర్ విశేష ప్రతిభ కనబరుస్తూ క్రిమినల్ లాస్ విభాగంలో బంగారు పతకం సాధించారు. దానితో పాటు లిఫ్టింగ్, ప్యాకింగ్, ఫార్వార్డింగ్ విభాగాలలో , ఇంకా మెడికల్ విభాగంలో కూడా ఎస్ఐ ప్రేమ్ సాగర్ రజత పతకాలు గెలుచుకున్నారు. ఆయన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్ జట్టు ఛాంపియన్ షిప్ సంపాదించి జాతీయ స్థాయి పోలీస్ మీట్ లో పాల్గొనడానికి అర్హత సాధించింది.
ప్రశంసాపత్రం అందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి: తెలంగాణ రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో అత్యధిక ప్రతిభ కనపరచిన జీడిమెట్ల ఎస్ఐ ప్రేమ్ సాగర్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అభినందించారు. ఎస్ఐ ప్రేమ్ సాగర్ కు ఆయన ప్రశంసాపత్రం అందజేశాడు. వీరితో పాటు బాలానగర్ డీసీపీ కె.సురేష్ కుమార్, ఏసీపీ నరేష్ కుమార్ లు ఎస్ఐ ప్రేమ్ కుమార్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఎస్ఐ ప్రేమ్ సాగర్ కనపరచిన ప్రతిభ పోలీస్ శాఖకే గర్వ కారణమని అధికారులు ప్రశంసించారు. ఈ ఏడాది పుణెలో జరగనున్న జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ప్రేమ్ కుమార్ పాల్గొని అక్కడ కూడా రాష్ట్రానికి, సైబరాబాద్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం జీడిమెట్ల పీఎస్ లో అభినందన సభ ఏర్పాటు చేయగా పలువురు ప్రశంసిస్తూ ఎస్ఐ ప్రేమ్ సాగర్ ను సన్మానించారు.
