ఆపరేషన్ కవచ్ తనిఖీల తర్వాత సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ కవచ్’ ఆకస్మిక తనిఖీల్లో పలు సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు నిబంధనలు పాటించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీ జారీ చేశారు.
పాత వాహనాల కొనుగోలు, విక్రయాల సమయంలో యజమాని వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని, వాహనం దొంగతనం కేసుల్లో ఉందా, బ్లాక్‌లిస్టులో ఉందా లేదా ప్రమాదాలకు గురైందా అనే విషయాలను వాహన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
వాహనాల ఓడోమీటర్ రీడింగ్‌లను మార్చడం, ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు ఇతర చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం నిర్వహించే ప్రతి డీలర్ సంబంధిత ఆర్టీఓ కార్యాలయం నుంచి అధికారిక అనుమతులు పొందాలని, ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ లేదా రాతపూర్వక రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. డీలర్ల కస్టడీలో ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో వాహనాల ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు దొంగతనం, మోసం, దొంగ సొత్తు కలిగి ఉండటం వంటి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
