Breaking News

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

ఒకరి అరెస్ట్.. రూ.8 లక్షల విలువైన నాలుగు బైక్‌ల స్వాధీనం

శంషాబాద్, జూన్ 4: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీసుల చాకచక్యంతో అంతర్రాష్ట్ర స్థాయిలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అలవాటుపడిన నేరస్థుడు అరెస్టయ్యాడు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాలుగు బైక్ చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.

షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లనే టార్గెట్

పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు మధ్యాహ్న భోజన సమయాన్ని లక్ష్యంగా చేసుకుని వివిధ బైక్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లకు వెళ్లేవాడు. తన వాహనానికి సర్వీసింగ్ చేయించాలని సిబ్బందిని నమ్మబలికిన అనంతరం, వారి నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికే సర్వీసింగ్ పూర్తయి సిద్ధంగా ఉన్న బైక్‌లను చాకచక్యంగా దొంగిలించి పరారయ్యేవాడు.

ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

నాలుగు కేసులు ఛేదన

నిందితుడి అరెస్టుతో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌తో పాటు కర్ణాటకలోని రాయచూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అడోని ప్రాంతాల్లో నమోదైన నాలుగు ద్విచక్రవాహన దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి.

180కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు అరెస్ట్.. హైదరాబాద్ సీసీఎస్, సైఫాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

రూ.8 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం

పోలీసులు నిందితుడి వద్ద నుంచి మూడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని తెలిపారు.

సాంకేతిక ఆధారాలతో అరెస్ట్

ఆర్జీఐఏ పరిధిలో నమోదైన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి కదలికలను గుర్తించారు. ప్రత్యేక నిఘా ద్వారా అతడిని అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ ఆపరేషన్‌లో ఎస్‌హెచ్‌వో సంజీవ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం కీలక పాత్ర పోషించింది. అంతర్రాష్ట్ర బైక్ దొంగను పట్టుకుని కేసులను ఛేదించిన ఆర్జీఐఏ క్రైమ్ టీమ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *