Breaking News

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్

అమరవీరుల త్యాగాలను స్మరించిన నగర పోలీస్ కమిషనర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుదీర్ఘమైన, చారిత్రాత్మక పోరాట ఫలితంగా ఏర్పడిందని పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారు కలలుగన్న తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సేవల్లో హైదరాబాద్ పోలీసుల వినూత్న సంస్కరణలు

నగర ప్రజలకు మెరుగైన శాంతిభద్రతల సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన విధానాలకు అనుగుణంగా హైదరాబాద్ పోలీసులు పలు సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన “గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్” ద్వారా దాదాపు 20 వేల మంది సిబ్బందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక హెల్త్ ప్రొఫైలింగ్ చేపట్టినట్లు తెలిపారు.

ఏఐ ఆధారిత పోలీసింగ్‌లో దేశానికి ఆదర్శంగా హైదరాబాద్

ఆధునిక పోలీసింగ్‌లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్, దేశంలోనే తొలిసారిగా “సీ-మిత్ర” వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 1,130 జీరో ఎఫ్‌ఐఆర్‌లు, 380 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఫిర్యాదుల నమోదును మరింత సులభతరం చేసేందుకు “ఏఐ కాప్‌రైటర్” యాప్‌ను, మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆన్‌లైన్ కంటెంట్ పర్యవేక్షణకు “సాక్-ఐ” అనే ఏఐ ఆధారిత అప్లికేషన్‌ను వినియోగిస్తున్నట్లు వివరించారు.

కల్తీ ఆహారంపై ఉక్కుపాదం

నగర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన “హెచ్-ఫాస్ట్” విభాగం ద్వారా కొద్దికాలంలోనే 173 కేసులు నమోదు చేసి, సుమారు 95 టన్నుల కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

డ్రగ్స్ నియంత్రణే ధ్యేయం: 100 మంది వినియోగదారులకు యాంటీ-డ్రగ్ కౌన్సిలింగ్ నిర్వహించిన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్‌ఫోర్స్

స్పందన బృందాలతో వేగవంతమైన సేవలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన “స్పందన – తక్షణ రక్షణ” రెస్పాండర్ బృందాలు రోజుకు సగటున 30 ఫిర్యాదులకు స్పందిస్తూ బాధితులకు త్వరితగతిన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా కాల్స్‌కు స్పందించినట్లు చెప్పారు.

మహిళా సిబ్బందికి ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ

త్వరలో 300 మంది మహిళా పోలీసు సిబ్బందికి డ్రైవింగ్ శిక్షణ అందించి పెట్రోలింగ్, బ్లూకోట్స్ సేవల్లో భాగస్వాములను చేయనున్నట్లు సీపీ వెల్లడించారు.

సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్

సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా “సైబర్ సింబా” వాలంటీర్ల ద్వారా ప్రతి శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం హెచ్-న్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని, డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

అధికారులు పాల్గొన్న కార్యక్రమం

ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాల అధికారులు, సీఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *