Breaking News

కారిడార్‌ పనులపై సీపీ,జీహెచ్‌ఎంసీ కమిషనర్‌-క్షేత్రస్థాయి పరిశీలన.

నగరంలోని కీలకమైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని ‘మోడల్‌ కారిడార్‌’గా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణిస్తూ.మార్గమధ్యలో ఉన్న బాటిల్‌ నెక్‌లు (ట్రాఫిక్‌ అడ్డంకులు), నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. పాదచారుల భద్రతకు పెద్దపీట: ఎస్‌.డి. ఐ హాస్పిటల్‌ వద్ద, బృందావన్‌ కాలనీ రోడ్‌ నెం.1 వద్ద కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల (FOB)ను నిర్మించాలని నిర్ణయించారు. షేక్‌పేట్‌ నాలా వద్ద పెలికాన్‌ సిగ్నల్‌, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు. జంక్షన్ల పునర్నిర్మాణం: నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ (Rotary) వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ: రేతిబౌలి నుంచి నానల్‌ నగర్‌ వరకు ఉన్న సెంట్రల్‌ మీడియన్‌ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్.ఎమ్.డి.సి, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్‌, బొడ్డురాయి, అలాగే షేక్‌పేట్‌ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు ఆదేశించారు. మాసాబ్‌ ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్‌ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌, ఐపీఎస్ మాట్లాడుతూ.ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణమే చేయదగ్గ పనులు, దీర్ఘకాలిక పనులను గుర్తించామన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ మాట్లాడుతూ.నగరంలోని ట్రాఫిక్‌ పనుల నిమిత్తం ప్రతి జోన్‌కు రూ. 20 కోట్ల చొప్పున మొత్తం రూ. 120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి.జోయల్ డెవిస్ ఐపిఎస్ (జాయింట్ సిపి ట్రాఫిక్), జి ముకుంద రెడ్డి ఐఎఎస్ (జోనల్ కమిషనర్), శ్రీమతి ప్రియాంక ఆలా ఐఎఎస్ (జోనల్ కమిషనర్), శ్రీమతి కాజల్ ఐపిఎస్ (డిసిపి ట్రాఫిక్), కె. శ్రీనివాస్ (ఛీఫ్ సిటీ ప్లానర్), ఎస్.రత్నాకర్ (ఛీఫ్ ఇంజనీర్), వేణుగోపాల్ రెడ్డి (అడిషినల్ డిసిపి), శ్రీమతి డి. ధన లక్ష్మి (ఎసిపి ట్రాఫిక్ గోల్కోండ) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *