Breaking News

మహిళల భద్రత, బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై సంగారెడ్డిలో అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో మహిళల భద్రత, బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపిఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, షీ టీమ్స్ బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. బాధిత మహిళలకు సఖీ కేంద్రాలు, భరోసా కేంద్రాలు అండగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే 100, 112, 1930, 1098 లేదా షీ టీమ్ నెంబర్ 8712656772 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

భయపడకుండా ముందుకు వచ్చినప్పుడే సమస్యలకు న్యాయం జరుగుతుందని, సమాజంలో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. పోక్సో కేసులను అత్యంత సీరియస్‌గా తీసుకుని నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం కేసు సమాచారం ఇవ్వకపోవడం కూడా శిక్షార్హమని హెచ్చరించారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, విద్యావంతులే ఎక్కువగా మోసాలకు గురవుతున్నారని తెలిపారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో వచ్చే కాల్స్ మోసపూరితమని, పోలీసులు వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయరని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు కాల్ చేయాలని లేదా NCRP పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. మొదటి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని తెలిపారు.

ముస్తాబాద్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

మాదకద్రవ్యాల దుర్వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, మొదట సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారుతుందని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా జిల్లా ఎస్-న్యాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

యువత అనవసర అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి లలిత కుమారి, సిడబ్ల్యుసి సభ్యుడు వెంకటేశం, డిప్యూటీ డీఎం & హెచ్ఓ నాగనిర్మల, కళాశాల ప్రిన్సిపల్ డా. శ్యామ్ కుమార్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రత్నం, డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, క్రాంతి కుమార్, రవి, షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *