ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే విద్యార్థులు, క్రీడాకారులు, యువతతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని హెచ్చరించారు. అలాగే మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
ప్రతి విద్యార్థి, యువకుడు యాంటీ డ్రగ్ సోల్జర్‌గా మారి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్ఐలు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు, యువత, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

