Breaking News

మొబైల్ స్నాచింగ్ నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్న మహంకాళి పోలీసులు

హైదరాబాద్‌లో మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను మహంకాళి పోలీసులు కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నారు. వేగవంతమైన దర్యాప్తుతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, వారి సమాచారం మేరకు ప్రధాన సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 29 ఏప్రిల్ 2026 ఉదయం బెంగళూరుకు చెందిన పల్లె ప్రశాంత్ కుమార్ (41) సికింద్రాబాద్ చేరుకున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం నిజామాబాద్ వెళ్లాల్సి ఉండటంతో పాట్నీ ఎక్స్ రోడ్స్ వద్ద బస్సు దిగి, ఫోన్‌లో క్యాబ్ బుక్ చేసుకుంటూ జేబీఎస్ బస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ సమయంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో నంబర్ ప్లేట్ లేని నలుపు రంగు హోండా యాక్టివాపై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారిలో మధ్యలో కూర్చున్న వ్యక్తి ప్రశాంత్ కుమార్ చేతిలోని శామ్సంగ్ మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసులు క్రైమ్ నెం. 88/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదు అందిన వెంటనే సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ సిహెచ్. శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, వ్యూహాత్మకంగా దర్యాప్తు చేసి 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి సమాచారం మేరకు ప్రధాన నిందితుడు రాకేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితుల్లో నడిగ రాకేష్ (19) ప్రధాన సూత్రధారి కాగా, అతను క్యాటరింగ్ పని చేస్తూ నేరెడ్‌మెట్‌లో నివసిస్తున్నాడు. మోకటి అభినేష్ (18) జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ నేరెడ్‌మెట్‌లోనే ఉంటున్నాడు. వీరితో పాటు ఇద్దరు బాల నేరస్థులను కూడా పోలీసులు గుర్తించారు.

గులేల్‌తో షాపుల అద్దాలు ధ్వంసం చేసిన ముఠా అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఐఎస్ సదన్ పోలీసులు

పోలీసుల విచారణలో నిందితులంతా స్నేహితులని, నేరెడ్‌మెట్‌లోని వినాయక్ నగర్‌కు చెందిన వారని తెలిసింది. రాకేష్ ప్రణాళిక ప్రకారం రోడ్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నట్లు బయటపడింది. ఈ నేరం కోసం ఏప్రిల్ 27న ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోండా యాక్టివా వాహనాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. అలాగే గాంధీనగర్, మీర్‌పేట్ ప్రాంతాల్లో కూడా వాహన దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

వీరిపై ఇప్పటికే హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. మల్కాజిగిరిలో నాలుగు కేసులు, జవహర్‌నగర్, చైతన్యపురి, ఘట్‌కేసర్, నేరెడ్‌మెట్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదై ఉంది.

నిందితుల నుంచి మూడు యాక్టివా వాహనాలు, బాధితుడి శామ్సంగ్ మొబైల్ ఫోన్, మరో ఒప్పో మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్ఐ సిహెచ్. ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ రెడ్డి, క్రైమ్ స్టాఫ్, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *