సిరిసిల్ల, ఏప్రిల్ 29: ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.6,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ బుధవారం కీలక తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని అభినందించారు.
కేసు వివరాలు
ముస్తాబాద్ మండలం బద్నకల్ గ్రామానికి చెందిన కస్తూరి రాంరెడ్డి మరియు కస్తూరి కరుణాకర్ రెడ్డి మధ్య వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ కక్షను మనసులో పెట్టుకున్న రాంరెడ్డి కుటుంబ సభ్యులు కరుణాకర్ రెడ్డిని హత్య చేయాలని పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది.
2020 డిసెంబర్ 27న కరుణాకర్ రెడ్డి తన పొలంలో పని చేస్తున్న సమయంలో కస్తూరి రాంరెడ్డి, అతని భార్య మంజుల, కుమారులు వెంకటేశ్, మహేష్ కలిసి అక్కడికి చేరుకుని గొడ్డలితో దాడి చేసి, కట్టెలతో కొట్టి హత్య చేశారు.
మృతుడి సోదరి పద్మ ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దర్యాప్తు – కోర్టు విచారణ
అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టులో 14 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైందని తేల్చి A1 నుంచి A4 వరకు నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించారు.
ఎస్పీ అభినందనలు
కేసులో శిక్ష పడటానికి కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అశ్విన్, సీఐలు సర్వర్, ఉపేందర్, మొగిలి, సిఎంఎస్ ఎస్సై రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు నవీన్, రాజేందర్, దేవేందర్, ప్రస్తుత సీఐ నాగేశ్వరరావు, ఎస్సై గణేష్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
