Breaking News

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌పురా హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సులైమాన్ సయీద్ అలియాస్ సులేమాన్ (32), కిషన్‌బాగ్‌కు చెందిన వ్యక్తి. మృతురాలు అతని భార్య నిషాద్ ఫాతిమా (30). ఈ ఘటనపై బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 177/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1), 238 ప్రకారం కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నిందితుడు, ఆమె తరచూ పుట్టింటికి వెళ్లడాన్ని కూడా వ్యతిరేకించేవాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. లోక్ అదాలత్ ద్వారా రాజీకి ప్రయత్నించినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదని, భార్యపై శారీరక, మానసిక వేధింపులు కొనసాగించినట్లు విచారణలో తేలింది.

ఈ నెల 7న మరోసారి భార్య పుట్టింటికి వెళ్లే విషయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో, ముందుగానే కిచెన్ కత్తిని దాచిపెట్టుకున్న నిందితుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాఢ నిద్రలో ఉన్న భార్యపై దాడి చేశాడు. కత్తితో గొంతు కోసి హత్య చేసి, అనంతరం నేర ఆనవాళ్లను చెరిపివేసేందుకు ఇద్దరి మొబైల్ ఫోన్లను పారేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బహదూర్‌పురా పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో లోతైన దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన బహదూర్‌పురా డీఐ వి. మదన్ లాల్, ఎస్‌ఐ జి. అంబేద్కర్, పోలీసు సిబ్బందితో పాటు వారికి మార్గదర్శకత్వం వహించిన ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ. జావీద్లను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *