Breaking News

సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: జిల్లాలో నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో జిల్లా పరిధిలోని ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలతో మాసిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో పారదర్శకత, జవాబుదారీతనం, సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు Crime and Criminal Tracking Network & Systems (CCTNS) వ్యవస్థను వంద శాతం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, ప్రతి కేసు వివరాలను ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు తప్పనిసరిగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, క్యారెక్టర్ సర్టిఫికెట్లు, దొంగిలించబడిన వాహనాల ట్రాకింగ్ వంటి ప్రజా సేవలను సీసీటీఎన్‌ఎస్ ద్వారా మరింత వేగంగా అందించవచ్చని పేర్కొన్న ఎస్పీ, ఈ వ్యవస్థ అమలులో నిర్లక్ష్యం లేదా అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించిన ఎస్పీ, గంజాయి విక్రేతలు, రవాణాదారులు, పాత కేసుల నిందితులు, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. వారి కదలికలను పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు, విస్తృత నిఘా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి కార్డన్ అండ్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా.. పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు

డిజిటల్ సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సీసీటీఎన్‌ఎస్‌లో అందుబాటులో ఉన్న నేర చరిత్ర సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ సూచించారు. కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేసి, జిల్లా కన్విక్షన్ రేటును పెంచేందుకు దర్యాప్తు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

“మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన, సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి రహిత గ్రామాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక తీర్మానాలు ఆమోదించడాన్ని ఎస్పీ అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం జిల్లాలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ డా. శబరీష్ అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *