Breaking News

చెర్లగౌరారంలో ఘనంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం

పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపుదలే లక్ష్యం

నల్లగొండ: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో ‘బాల పంచాయతీ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్య అవగాహన కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని పలు సమస్యలపై తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ మాట్లాడుతూ పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించి వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమన్నారు. విద్యతో పాటు సామాజిక అవగాహన కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, మానసిక అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో యంగిస్థాన్, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ్ గ్రామంలో బాలల సాధికారత కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు, ఎస్‌ఐలు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు 300 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *