Breaking News

లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్

మొబైల్ ఫోన్, రూ.110 కోసం మధ్యప్రదేశ్ కార్మికుడిని రాళ్లతో కొట్టి చంపిన నిందితులు

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, మొబైల్ ఫోన్ దోచుకోవాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ రైల్వే నిలయం సమీపంలోని తుకారామ్‌గేట్ రైల్వే బ్రిడ్జి బైపాస్ రోడ్డు వద్ద జూన్ 3న రక్తపు మడుగులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి తలపై తీవ్ర గాయాలు ఉండటంతో పాటు ఘటనాస్థలంలో రక్తం అంటిన రాళ్లు కనిపించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తులో మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల జై ప్రకాష్ దేశ్‌ముఖ్‌గా గుర్తించారు. ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.

కేసును సవాలుగా తీసుకున్న లాలాగూడ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. జూన్ 8న ధాబీ వినోద్ (30), మక్కల మోహన్ (19)లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.

పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్

పోలీసుల కథనం ప్రకారం, మోండా మార్కెట్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న జై ప్రకాష్‌ను గమనించిన నిందితులు, రైల్వే స్టేషన్ వద్ద దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నారు. అనంతరం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. బాధితుడు ప్రతిఘటించడంతో రాళ్లతో తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రిక్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ధాబీ వినోద్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన లాలాగూడ పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ బృందాలను ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *