తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేసేందుకు బాలానగర్ సీఐ నర్సింహారాజు వినూత్నంగా స్పందించారు. ఫలితాల కారణంగా నిరుత్సాహానికి లోనవుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పి, వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
బాలానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఫెయిలైన విద్యార్థులతో సీఐ ముఖాముఖి మాట్లాడారు. పరీక్షల్లో వచ్చిన ఫలితాలు జీవితానికి తుది నిర్ణయం కాదని, ఒక పరీక్ష కేవలం ఒక దశ మాత్రమేనని విద్యార్థులకు వివరించారు.
“పరీక్షా ఫలితం మీ సామర్థ్యాన్ని ఆ క్షణానికి మాత్రమే అంచనా వేస్తుంది. అది మీ వ్యక్తిత్వాన్నో, భవిష్యత్తునో నిర్ణయించదు” అని ఆయన అన్నారు.
విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి నింపుతూ “కెరటం నాకు ఆదర్శం.. అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు” అంటూ ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా సీఐ కీలక సూచనలు చేశారు. పిల్లల మార్కులను తమ పరువు ప్రతిష్టలతో ముడిపెట్టవద్దని, పక్కింటి పిల్లలు లేదా బంధువుల పిల్లలతో పోల్చి వారిపై ఒత్తిడి తేవద్దని సూచించారు. పిల్లలలోని ప్రతిభను గుర్తించి, వారికి అండగా నిలవాల్సిన సమయం ఇదేనని చెప్పారు.
“ఓటమి అనేది జీవితం ముగింపు కాదు.. అది మరో విజయానికి తొలి పాఠం” అని పేర్కొంటూ, చదువులో వెనుకబడిన వారు కూడా ఇతర రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని విద్యార్థులకు తెలియజేశారు.
సీఐ నర్సింహారాజు చేసిన ఈ చొరవ విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంది.
