Breaking News

దేవరకొండ SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం బహిర్గతం – రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం, నలుగురు అరెస్ట్

News Content:
నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – ACB బ్రాంచ్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు సహ నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం రూ.2,42,10,000 నగదు, 6 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 13, 2026న బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌లో కాంట్రాక్ట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి, బ్యాంక్‌లోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, నాన్-బ్రాంచ్ KYC ప్రక్రియను అక్రమంగా ఉపయోగించి రూ.2,65,55,268 నగదును మోసపూరితంగా బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు క్రైమ్ నం.144/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు చక్రపాణి, సూర్యాపేట SBI బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు సహకారంతో ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. MIS ద్వారా ఇనాక్టివ్ ఖాతాల వివరాలు సేకరించి, నకిలీ ఆధార్, PAN కార్డులు తయారు చేసి, ఖాతాల KYC వివరాలను మార్పులు చేసి, YONO యాప్ ద్వారా అక్రమంగా డబ్బులు బదిలీ చేశారు.

ఈ మోసంలో కేతవత్ రాంలాల్ మరియు మారేపల్లి శివ ఇతర వ్యక్తుల ఖాతాలను ఉపయోగించి నగదును మళ్లించే పనిలో సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మోసం చేసిన డబ్బును ముందుగా నిర్ణయించిన వాటాల ప్రకారం నిందితులు పంచుకున్నట్లు విచారణలో తేలింది.

ఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదు

ఈ ఘటన బయటపడటానికి కారణం, ఒక ఖాతాదారుడికి అక్రమ KYC అప్డేట్ పై ఈ-మెయిల్ అలర్ట్ రావడం. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశాయి. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *