హైదరాబాద్, ఫిబ్రవరి 19 : విలాసాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అల్లిన ‘దొంగతనం’ డ్రామాను చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి, గుర్తుతెలియని వ్యక్తులపై నెట్టేయాలని చూసిన నిందితుడిని అరెస్ట్ చేసి, రూ. 12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అప్పుల తీర్చలేక.. అడ్డదోవ తొక్కి..
పోలీసుల కథనం ప్రకారం.. అలేఖ్య ఎస్టేట్‌లో నివసించే భాస్కర్ ప్రమోద్ ముల (32) అనే యువకుడు బి.టెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అయితే మధ్యలోనే తిరిగి వచ్చి బెంగళూరులో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల రూపంలో భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి 2024 నుండి తన నానమ్మకు చెందిన బంగారాన్ని దొంగిలిస్తూ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రూ. 4.60 లక్షలు పొందాడు.
పెళ్లి ముహూర్తం ఖాయం కావడంతోనే డ్రామా!
ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ నగలను తీయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన గుట్టు బయటపడుతుందని భయపడిన భాస్కర్, ఈ నెల 9న తన పెంట్ హౌస్‌లో దొంగతనం జరిగినట్లుగా ఒక కట్టుకథ అల్లాడు. ఎవరో చొరబడి నగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు.
పోలీసుల చాకచక్యం..
కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా, భాస్కర్ మాటల్లో పొంతన లేకపోవడాన్ని గమనించారు. నిశితంగా విచారించడంతో తానే నిందితుడినని భాస్కర్ అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి:
- 3 తులాల బంగారు ఉంగరాలు
- వెండి వస్తువులు
- 80 గ్రాముల బంగారానికి సంబంధించిన మోర్టిగేజ్ స్లిప్పులు (HDFC, SBI, ముత్తూట్ ఫైనాన్స్) స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షితా కృష్ణమూర్తి, ఐపిఎస్, ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ మల్లేశం బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
