Breaking News

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

నల్గొండ పట్టణంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మృతురాలి అక్క కూతురు, ఆమె భర్త, అతని స్నేహితుడు, బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి కలిసి వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

ఈ నెల 22న నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఇంట్లో హసీనా, ఆమె భర్త సుల్తాన్, కుమారుడు ముజమ్మిల్, కుమార్తె అఫ్కూరా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మూడు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సీసీఎస్ బృందంతో కలిసి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితులను నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం తన భార్య తబస్సుంతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని, హసీనా వద్ద తీసుకున్న అప్పు విషయంలో అవమానానికి గురైనట్లు గుర్తించారు. హసీనా తనకు డబ్బు ఇవ్వకపోవడంతో పాటు పాత అప్పు కూడా వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారం ఉందనే సమాచారంతో హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. హత్యకు ముందు అస్లాం యూట్యూబ్‌లో హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి వంటి వీడియోలు చూసి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తెల్లవారుజామున బయటకు వచ్చిన హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని వచ్చిన సుల్తాన్‌ను హత్య చేశాడు. తర్వాత ప్రతిఘటించిన ముజమ్మిల్‌ను కూడా చంపగా, ఘటనను చూసిన 12 ఏళ్ల అఫ్కూరాను సాక్ష్యాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. పట్టీలు అందజేసిన జిల్లా ఎస్పీ

హత్య అనంతరం ఇంట్లోని బంగారం, నగదు, భూమి, బ్యాంకు పత్రాలు తీసుకుని ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు పారిపోయిన నిందితుడు, తన స్నేహితుడు సహాయంతో బంగారు ఆభరణాలను నగదుగా మార్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుల నుంచి మహీంద్రా మరాజో కారు, రూ.30.04 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్‌ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, రక్తపు మరకలున్న దుస్తులు, భూమి, బ్యాంకు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించిన ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సీసీఎస్ సిబ్బంది, నల్గొండ టౌన్ పోలీసు సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *