Breaking News

పోక్సో, హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల, జూన్ 17: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, అనంతరం ఆమె హత్యకు కారణమైన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం తీర్పు వెలువరించారు.

ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. చందుర్తి, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బండపల్లి నవీన్‌పై కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.

కేసు వివరాలు

మూడపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

అదే బాలిక హత్యకు సంబంధించిన కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అప్పటి ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు తీర్పు

కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించి, పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.7,000 జరిమానా, హత్య కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

ఎస్పీ అభినందనలు

నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి, కేసును సమర్థవంతంగా కోర్టులో ప్రవేశపెట్టిన అప్పటి, ప్రస్తుత పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.

మైనర్లపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *