Breaking News

తిప్పర్తి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నల్లగొండ: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతంలో యువకుడు బోథ్ సాయి కుమార్ హత్యకు గురైన కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ జి. రమేష్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు బోథ్ సాయి కుమార్ (27) నల్లగొండ పట్టణంలోని గొల్లగూడెం ప్రాంతానికి చెందినవాడు. గ్రామ దేవతల పండుగలు, ముఖ్యంగా ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పే వాడిగా స్థానికంగా గుర్తింపు పొందాడు. ప్రధాన నిందితుడు ఫూర్ఖాన్ అలియాస్ మహేష్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు కాగా, జీవనోపాధి కోసం నల్లగొండకు వచ్చి చీరల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అప్పుడప్పుడు కలిసి మద్యం సేవించేవారని పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు తన వ్యాపార అవసరాల కోసం సాయి కుమార్‌ను రూ.30 వేల అప్పు అడిగినా, అతడు నిరాకరించడంతో అతనిపై కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది. అనంతరం సాయి కుమార్ వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 8వ తేదీన ఫూర్ఖాన్ తన సహచరుడు ఆరిఫ్‌తో కలిసి మద్యం పార్టీ పేరుతో సాయి కుమార్‌ను కేశరాజుపల్లి శివారులోని నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించిన అనంతరం డబ్బుల విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితులు సాయి కుమార్‌పై దాడి చేసి, సిమెంట్ రాయితో తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

హత్య అనంతరం మృతుడి వద్ద ఉన్న బంగారు తాయెత్తు, చెవి కమ్మ, ముక్కుపుడకతో పాటు సెల్ ఫోన్, హోండా ఆక్టివా స్కూటీని తీసుకుని నిందితులు పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా రక్తపు మరకలు అంటిన దుస్తులను దాచిపెట్టి, దోచుకున్న బంగారాన్ని విక్రయించేందుకు విజయవాడకు వెళ్లినట్లు విచారణలో తేలింది.

సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ సహాయంతో నిందితుల ఆచూకీని గుర్తించిన పోలీసులు విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

యాలాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

నిందితుల వద్ద నుంచి ఒక బంగారు తాయెత్తు, బంగారు ముక్కుపుడక, బంగారు చెవి కమ్మతో పాటు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల బరువు సుమారు 6 గ్రాములు ఉంటుందని వెల్లడించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలోని పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

గమనిక: కేసులోని ఆరోపణలు పోలీసుల దర్యాప్తు ఆధారంగా ఉన్నాయి. నిందితులపై ఆరోపణలు న్యాయస్థానంలో రుజువయ్యే వరకు వారు చట్టపరంగా నిందితులుగానే పరిగణించబడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *