జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసులో నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దొంగతనాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రబల ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రి పహారా విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, కాలనీలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో అధిక సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, వ్యాపార వర్గాల సహకారం తీసుకోవాలని తెలిపారు. నేరస్తులను గుర్తించడంలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతి కేసులో “క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్” పాటించాలని, శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో నిర్లక్ష్యం లేకుండా చట్టపరమైన నిబంధనల ప్రకారం సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని, కోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి కేసుకు సంబంధించిన సీసీ నంబర్లు తీసుకోవాలని సూచించారు.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) డేటాను ఎప్పటికప్పుడు నవీకరించాలని, మాన్యువల్ రికార్డులు మరియు డిజిటల్ నమోదుల మధ్య వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని హెచ్చరించారు. డేటా నమోదు విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని, దీనివల్ల కోర్టులపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని తెలిపారు.
సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని లేదా ఎన్‌సీఆర్‌పీ (NCRP) పోర్టల్ ద్వారా సమాచారాన్ని అందించాలని ప్రజలకు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు.
మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీ షీటర్ల పర్యవేక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, గంజాయి మరియు మాదక ద్రవ్యాల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, శివరాం రెడ్డి, రాజశేఖర రాజు, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణతో పాటు సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

