హైదరాబాద్, మే 30: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న సైఫాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను బట్టబయలు చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 21.251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎం. స్వామికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, మే 29న లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు. సాయంత్రం సమయంలో మూడు లగేజీ బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, 19 ప్యాకెట్లలో దాచిన 21.251 కిలోల గంజాయి లభ్యమైంది.
అరెస్ట్ అయిన నిందితులను తిప్పిగిరి లక్ష్మి అలియాస్ బుగమ్మ (43), ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న నారాయణపేట జిల్లా వాసి, అలాగే ముంబైకి చెందిన సందీప్‌కౌర్ మఖన్ సింగ్ (60)గా గుర్తించారు. విచారణలో వారు విశాఖపట్నానికి చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి, విక్రయాల కోసం ముంబైకి తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బేబీ, సంపత్ అనే మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 21.251 కిలోల గంజాయి, మూడు లగేజీ బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 210/2026గా కేసు నమోదు చేసి, ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఖైరతాబాద్ జోన్ సైఫాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో ఎ. సీతయ్య పర్యవేక్షణలో అడిషనల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాజేందర్, ఎస్‌ఐ ఎం. స్వామి, మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంతో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ మూలాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
