టొరాంటో : కారో, బస్సో పల్టీలు కొట్టడం చూశాంగానీ.. విమానం పల్టీ కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఇప్పడు ఆ సరదా కూడా తీరిపోయింది.
కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం (ఫిబ్రవరి 17) ఓ విమానం అదుపుతప్పి అమాంతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయి పల్టీలు కొట్టింది.
అక్కడ తీవ్రంగా మంచు కురుస్తుండటంతో విమానం రన్‌వేపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు.
ఎండీవర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన CRJ900 విమానం ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
బోల్తా పడిన విమానం నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసి, అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. విమానంపై నీటిని చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కెనడాకు చెందిన బాంబార్డియర్ తయారు చేసిన ఈ CRJ900 విమానంలో మొత్తం 90 మంది వరకు ప్రయాణించవచ్చు.ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని కెనడియన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 19 మంది ప్రయాణికులేనని, వారిని ఏరియా ఆసుపత్రులకు తరలించారని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది.