“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఏప్రిల్ 18న నిర్వహించిన ఆరవ రోజు కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, హెల్మెట్ పంపిణీ, సీపీఆర్ ట్రైనింగ్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాహనం వేగం కంటే దాన్ని నియంత్రించగలగడం ముఖ్యమని, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
నారాయణఖేడ్ సబ్-డివిజన్ పోలీసులు లయన్స్ క్లబ్ సహకారంతో నారాయణఖేడ్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి సుమారు 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
అదే విధంగా సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో బుదేరా గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, వాహనదారులకు 150 హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సీపీఆర్ పై శిక్షణ ఇచ్చి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని ప్రజలు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమాల ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా, ప్రమాదాలను తగ్గించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
