• బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత..
• బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు..
• ఆపరేషన్ స్మైల్ – XIIలో 133 మంది బాల కార్మికుల విముక్తి
• ఆపరేషన్ స్మైల్ ను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
సంగారెడ్డి జిల్లా : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా గడిచిన నెల రోజులుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే “ఆపరేషన్ స్మైల్ – XII” అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలలో బాల కార్మిక వ్యవస్థ ఒకటని అన్నారు. 5 నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు కార్మికులుగా పనిచేస్తే వారిని బాల కార్మికులుగా పరిగణిస్తారని, బాలలను కార్మికులుగా నియమించడం వారి ప్రాధమిక హక్కుకు భంగం కలిగించినట్లేనని అన్నారు.
వ్యవసాయం, గనులు, తయారీ, నిర్మాణ రంగం, పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బిక్షాటన తదితర రంగాలలో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారని, బాలలు కార్మికులుగా కొనసాగడం వల్ల వారు భవిష్యత్తులో ఉన్నతమైన జీవితం గడపే అవకాశాలు కోల్పోతారని, సరైన విద్య లేకపోవడం వలన ఉపాధి అవకాశాలు దూరమవుతాయని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో రాణించాలంటే విద్యతో పాటు సరైన పోషకాహారం, ఆటలలో చురుకుదనం, తోటి విద్యార్థులతో పోటీపడే సామర్థ్యం అవసరమని అన్నారు. బాల కార్మికులుగా మారడం వలన సరైన మార్గదర్శనం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహకారం లేక పలువురు బాలలు నేరాల వైపు మళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులు, చిన్నారులే దేశ ప్రగతికి పునాది అని, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఈ హైటెక్ యుగంలో కూడా బాల కార్మిక వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని నాశనం చేస్తోందని అన్నారు. బాల కార్మికులు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలతో కూడిన దేశమే అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు. , బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలుగా పేదరికం, నిరక్షరాస్యత, తక్కువ ఆదాయం, కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో అనేక కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి నెట్టివేస్తున్నాయని, చిన్నారులు చిన్న చిన్న చేతులతో బతుకుబండిని లాగుతూ, అనారోగ్యాలకు గురవుతున్నారు అన్నారు.
బాల కార్మిక వ్యవస్థ అనే కబంధ హస్తాల నుంచి చిన్నారులను విముక్తి చేయాలనే లక్ష్యంతో 2014 నుండి ప్రతి సంవత్సరం జనవరి నెలలో “ఆపరేషన్ స్మైల్”, జూలై నెలలో “ఆపరేషన్ ముస్కాన్” కార్యక్రమాలను పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలలను పనిస్థలాల నుంచి రక్షించి, పాఠశాలలో చేర్చడం, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చుతూ బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
ఎవరైనా బాల కార్మికులు కనిపించినా, లేదా ఎక్కడైనా బాలలు పని చేస్తున్నట్లు సమాచారం ఉన్నా చైల్డ్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 లేదా అత్యవసర నెంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలను కోరారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను వెట్టిచాకిరికి గురి చేయడం, బలవంతంగా బిక్షాటన చేయించడం, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు తదితర ప్రదేశాల్లో పని చేయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విధమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.
ఈ సంవత్సరం ఆపరేషన్ స్మైల్ – XIIలో భాగంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 93 కేసులు నమోదు చేసి, 122 మంది బాలలు, 11 మంది బాలికలు మొత్తం – 133 మంది బాల కార్మికులను రక్షించి విముక్తి కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖలకు చెందిన అధికారి, సిబ్బందిని జిల్లా ఎస్పీ హృదయపూర్వకంగా అభినందించారు.
