హైదరాబాద్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదివారం ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఆర్మరీలోని ఆయుధాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం సేవలందించే పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత దివ్య ఆశీస్సులతో పోలీసు అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్. శ్రీనివాస్, చైతన్యకుమార్, రమణారెడ్డి, రాఘవేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.