అమరుల స్ఫూర్తితో ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఐఏఎస్, ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఐఏఎస్‌తో కలిసి అమర పోలీసులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
హాట్ స్ప్రింగ్స్ ఘటన అమరుల త్యాగానికి ప్రతీక
1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు ప్రతి పోలీసు అధికారికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా పోలీసు శాఖ
తెలంగాణలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో అనేక మంది పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని ఎస్పీ గుర్తుచేశారు. విధి నిర్వహణలో చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులకు నివాళి
2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బంది త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యతని ఎస్పీ అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలే లక్ష్యం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనగా ఈరోజు 21 నుంచి అక్టోబర్ 31న నిర్వహించే సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేస్తూ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.