డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని, ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలు, అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఇతరుల పేరుతో చేసే మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను వెల్లడించకూడదని స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో నగదు సరైన వ్యక్తికి లేదా ఖాతాకు వెళ్తుందో నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీ పూర్తి చేయాలని సూచించారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు లేదా వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా, విశ్వసనీయమైన ఆన్‌లైన్ వేదికలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయనే ఆశతో ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ, షేర్ మార్కెట్ పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మవద్దని తెలిపారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత వ్యక్తులు, సంస్థల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, తొందరపడి డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోవద్దని సూచించారు.
పోలీసులు, సీబీఐ, కస్టమ్స్ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్, వీడియో కాల్స్ చేసి కేసులు, అరెస్టులు, చట్టపరమైన చర్యల పేరుతో భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. చట్టబద్ధమైన విచారణ పేరుతో వీడియో కాల్‌లోనే అరెస్టు చేసినట్లు బెదిరించి డబ్బులు వసూలు చేయడం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న మోసపూరిత పద్ధతుల్లో ఒకటని వివరించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి విద్యార్థులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
