61 చోరీ కేసుల్లో నిందితుడు.. తుపాకీ, బంగారు ఆభరణాల స్వాధీనం
వికారాబాద్, జూన్ 4: వికారాబాద్ జిల్లా పోలీసుల చాకచక్యంతో అంతర్రాష్ట్ర స్థాయిలో వరుస చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్ అరెస్టయ్యాడు. నిందితుడి నుంచి తులంన్నర బంగారు ఆభరణాలు, ఒక 5 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నమోదైన 27 రాత్రిపూట చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి.
మణికంఠ నగర్ చోరీ కేసు ఛేదన
గత నెల మే 1న వికారాబాద్ పట్టణంలోని మణికంఠ నగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగి బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నేరస్థుల కదలికలను విశ్లేషించిన పోలీసులు చివరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ సింగ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కూలీగా నటిస్తూ రాత్రిళ్లు దొంగతనాలు
పోలీసుల విచారణలో నిందితుడు పగటి పూట కూలీ పనులు చేస్తున్నట్లు కనిపిస్తూ, రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది.
16 ఏళ్ల వయసులోనే నేర జీవితాన్ని ప్రారంభించిన వికాస్ సింగ్‌పై గతంలో 34 చోరీ కేసులు నమోదయ్యాయి. జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత కూడా తన నేర కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.
157 తులాల బంగారం, 256 తులాల వెండి చోరీ
విచారణలో నిందితుడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 27 చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసుల్లో మొత్తం 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8.22 లక్షల నగదును అపహరించినట్లు వెల్లడించాడు.
దొంగసొమ్ముతో విలాసవంతమైన జీవితం
చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే కాకుండా, తన స్వగ్రామంలో ‘హెల్పింగ్ హ్యాండ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికులలో మంచి పేరు సంపాదించుకున్నట్లు విచారణలో బయటపడింది. పాఠశాలలకు బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేయడం, స్నేహితులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారం వ్యాపారుల పాత్రపై దర్యాప్తు
దొంగిలించిన బంగారాన్ని ఉత్తరప్రదేశ్‌లోని కొందరు బంగారం వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ వ్యాపారులు దొంగసొమ్మును కొనుగోలు చేయడమే కాకుండా మరిన్ని నేరాలకు ప్రోత్సహించారని, అక్రమ ఆయుధం కొనుగోలు చేసేందుకు కూడా డబ్బు అందించినట్లు వెల్లడించాడు.
రిసీవర్లపై కూడా కేసులు
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బంగారం వ్యాపారులపై కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్మ్స్ యాక్ట్ తదితర చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు ఎస్పీ సూచనలు
కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగను పట్టుకుని కేసులను ఛేదించిన డీఎస్పీ అంజయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ మరియు వారి బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
