Breaking News

గంజాయి నిర్మూలనకు అర్ధరాత్రి బైక్ గస్తీ.. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, మే 30: జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా బైక్‌పై ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి వినియోగం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిస్థితులను పరిశీలించారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, చెట్ల పొదలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, పార్కులు, విద్యాసంస్థల సమీప ప్రాంతాలు, యువత ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, గంజాయి మహమ్మారి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే, మత్తు పదార్థాలకు బానిసైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా గంజాయికి బానిసైన వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక కిట్ల ద్వారా అనుమానితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించి గంజాయి వినియోగాన్ని గుర్తిస్తున్నామని, ఇప్పటివరకు 100 మందికిపైగా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. పాజిటివ్‌గా తేలిన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

గంజాయి అలవాటుతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు హెల్ప్‌లైన్ 8712656999ను సంప్రదించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని, గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీల్లో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రఘుపతి రెడ్డి, ఎస్‌ఐ శివరామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *