వికారాబాద్, మే 30: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో మద్యం సీసాలను సీజ్ చేశారు.
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టణంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని గుర్తించి, అతని వద్ద నుంచి సుమారు 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇందిరానగర్ కాలనీలో కొందరు యువకులు ఇంటి ముందు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయగా, అక్రమంగా నిల్వ ఉంచిన 55 బీర్ బాటిల్లు, 43 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలోని పలు లాడ్జీల్లో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 15 ఏళ్ల బాలుడిని గుర్తించి విచారించగా, అతను పెద్దేముల్ మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అని, ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. వెంటనే స్పందించిన డీఎస్పీ అంజయ్య బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారిని పిలిపించి సురక్షితంగా బాలుడిని అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా పాపిలోన్ డివిజన్ బృందంతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వాహన దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అంజయ్య తెలిపారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో వికారాబాద్ ఎస్‌హెచ్‌వో రఘు కుమార్, క్యూఆర్టీ బృందం, క్రైమ్ టీమ్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
SEO Tags:
వికారాబాద్ పోలీస్ స్పెషల్ డ్రైవ్, Vikarabad Police, Sneha Mehra, DSP Anjaiah, Ganja Seized Vikarabad, Illegal Liquor Seized, Vikarabad Crime News, Telangana Police News, Missing Boy Traced, Railway Station Checking, Special Drive Telangana, Crime Control Vikarabad, Vikarabad Latest News, Telangana Crime Updates, Police Inspection News.
