Breaking News

నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”తో కేసముద్రంలో గంజాయి అనుమానిత ప్రాంతాల తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కూంబింగ్ మరియు తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. యువతను గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కేసముద్రం ఎస్సై కె. క్రాంతి కిరణ్, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్‌తో కలిసి గ్రామ శివారు ప్రాంతాలు, చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రదేశాలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, యువత గుమికూడే ప్రాంతాలు మరియు గంజాయి సేవిస్తున్నట్లు అనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దని, యువత చదువు, ఉద్యోగం, క్రీడలు మరియు మంచి లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని కోరారు.

గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మహబూబాబాద్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. గుడుంబా, బెల్లం, బీర్ బాటిళ్ల స్వాధీనం

ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కేసముద్రం పరిధిలో మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి సేవిస్తూ లేదా విక్రయిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్ మరియు కేసముద్రం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *