కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు
రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం
కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్ కౌంటర్ కాంట్రాక్టర్‌కు రూ.5లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు వెల్లడించింది. గతేడాది నవంబర్ 3న కాకినాడకు చెందిన న్యాయవాది జల్లిగంపల లక్ష్మీనారాయణ అన్నవరం వెళ్లారు. ఆలయంలోని ఓ డిపాజిట్ కేంద్రంలో మొబైల్ ఉంచారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మొబైల్ తీసుకునేందుకు డిపాజిట్ కేంద్రం దగ్గరకు వెళ్లారు.
అక్కడి డిపాజిట్ కేంద్రంలో రూ.10 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. అయితే అక్కడ రూ.10 అని బోర్డుపై ఎందుకు రాయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.. వారి నుంచి స్పందన లేకపోవడంతో డిసెంబర్ 4న కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. అయితే రూ.5 వసూలు చేసేందుకే అనుమతి ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్.. లక్ష్మీనారాయణ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5తో పాటు మానసిక క్షోభకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. సదరు గుత్తేదారు.. అన్నవరం దేవస్థానానికి రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు సీహెచ్.రఘుపతి వసంతకుమార్, సభ్యులు చెక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు ఇచ్చారు.