Breaking News

మున్సిపల్ ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

పోలింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి –

మున్సిపల్ ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు –

మహబూబాబాద్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్, తెలిపారు. ఎన్నికల విధుల్లో సుమారు 750 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.

మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో ఎన్నికల విధులకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజు మాత్రమే కాకుండా, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లరాదని, రూట్ మొబైల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తన స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చిన్న సంఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధమని, పోలింగ్ బూత్‌లలో సెల్ఫీలు దిగడంపై కఠిన నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల 100, 200 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తులు ఉండరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల పరిధిలో BNSS సెక్షన్ 163 (పాత సెక్షన్ 144) అమల్లో ఉంటుందని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. మొబైల్ రూట్ టీమ్‌లు ఎలాంటి సంఘటన జరిగినా తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ఎన్నికలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని,
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *